: ఎన్ని కోట్లిచ్చినా నన్ను కొనలేరు: వైకాపా ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎన్ని కోట్లిచ్చినా తనను మాత్రం కొనలేరని మార్కాపురం ఎమ్మెల్యే, వైకాపా నేత జంకె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రాజంపల్లి తిరునాళ్లలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలసి కనిపించిన ఆయన ప్రసంగిస్తూ, యువనేత జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ రామరాజ్యం వస్తుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చి చూసి వెళ్లడం తప్ప చంద్రబాబు మరేమీ చేయలేదని విమర్శించారు. బాబుకు ఓటు వేసిన వారు ఇప్పుడు చింతిస్తున్నారని అన్నారు. కరవుతో రైతులు, ఉద్యోగాలు లేక యువత, ఉపాధి లేక కూలీలు బాధపడుతున్నారని, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులను సైతం చంద్రబాబు సర్కారు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నా, రైతులు సుఖంగా ఉండాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.