: జగన్ ఆశలపై ఈసీ నీళ్లు!... రాజ్యసభ ఎన్నికల్లో విప్ కు చెల్లుచీటి!
ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తన పార్టీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఆయన చేసిన ఏ ఒక్క యత్నం కూడా ఫలించలేదు. మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ దిశగా మూడు సార్లు యత్నించిన జగన్... మూడు సార్లూ విఫలమయ్యారు. ఇక మరో రెండు నెలల్లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల సందర్భంగా తన ప్లాన్ సక్సెస్ అయి తీరుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ఎలాగంటే... రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఎమ్మెల్యేలు తమ ఓటును పార్టీ ప్రతినిధికి చూపించి మరీ వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ఓటేసే ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ధిక్కరించినట్లు తేలిపోతుంది. దీనిని సాక్ష్యంగా చూపి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చన్నది జగన్ ప్లాన్. అయితే జగన్ ఆశలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నీళ్లు చల్లింది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ చెల్లదని, వేరే పార్టీకి ఓటేసే ఎమ్మెల్యేలపై సదరు ఎమ్మెల్యేలకు చెందిన పార్టీ అనర్హత వేటు వేయడం కుదరదని నిన్న ఈసీ వెల్లడించింది. ఇలాంటి ఎమ్మెల్యేలపై అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, సభ్యత్వాలను రద్దు చేయడం మాత్రం కుదరదని తేల్చిచెప్పింది. ఈసీ మార్చిన నిబంధన మేరకు విప్ ను ధిక్కరించే ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే... అంతిమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలా విప్ ధిక్కరించే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేస్తే... పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆ చర్య వరంగా మారుతుంది. దీంతో ఉన్న ఒక్క అవకాశం చేజారడంతో జగన్ డైలమాలో పడిపోయారు.