: ఇండియా తానో సుందరాంగినని భావిస్తోంది: చైనా మీడియా అడ్డగోలు రాతలు


అమెరికాతో లాజిస్టిక్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇండియా నిర్ణయించిన వేళ, ఈ డీల్ తో ఇండియాలో తమ వ్యాపారాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న చైనా అవాకులు, చవాకులు పేలుతోంది. భారత్ తానో అత్యంత అందమైన అందగత్తెగా భావిస్తూ, ప్రతిఒక్కరూ అలానే అనుకోవాలని చూస్తోందని, ముఖ్యంగా ప్రపంచ సూపర్ పవర్ లుగా ఉన్న వాషింగ్టన్, బీజింగ్ లతో ఒకేసారి సంబంధాల కోసం వెంపర్లాడుతోందని చైనా ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న 'గ్లోబల్ టైమ్స్' సోమవారం నాటి సంచికలో అడ్డగోలు రాతలు రాసింది. చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేడు తన తొలి చైనా పర్యటనకు బయలుదేరనున్న వేళ, ఈ కథనాలు రావడం గమనార్హం. "తనంత సుందరాంగి లేదని భావిస్తున్న ఇండియా, అందరు మగవాళ్లూ అలాగే అనుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ బలాడ్యులైన యూఎస్, చైనాలను తన వెంట పడేలా చూసుకోవాలని అనుకుంటోంది" అని అభిప్రాయపడింది. ఇది ఇండియాకు సరికాదని, కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో భారత దౌత్య విధానం ఎలాంటి మలుపులు తిరిగిందన్న విషయాన్ని తాము ఇప్పటికీ గుర్తుంచుకున్నామని తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో కలిసి సంయుక్త పెట్రోలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించింది. కాగా, ఇండియాలోని అపార వ్యాపారావకాశాలు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో చైనా కంపెనీలు తమ వాటాను గణనీయంగా పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకునే ఎల్ఎస్ఏ (లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్) డీల్ తమ దేశపు కంపెనీల అవకాశాలను దెబ్బతీస్తుందన్న అక్కసుతోనే చైనా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News