: ఏపీ, తెలంగాణల్లో గత పదేళ్ల రికార్డులను బద్దలు కొట్టిన భానుడు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపాగ్ని కొనసాగుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ లోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటింది. హైదరాబాద్ లో నిన్న ఈ ఏడాదిలోనే అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 45, నిజామాబాద్ లో 44.9, ఆదిలాబాద్ లో 44.6, మెదక్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని విజయవాడలో 44. 5, రెంటచింతలలో 44.9, విశాఖపట్నంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2006 తరువాత ఏప్రిల్ లో ఈ స్థాయిలో ఎండకాయడం ఇదే తొలిసారని అధికారులు వ్యాఖ్యానించారు. వడదెబ్బతో నిన్న ఒక్కరోజులోనే 80 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో 50 మంది, ఏపీలో 30 మంది మరణించినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో 11 మంది, అనంతపురం జిల్లాలో 10 మంది వడదెబ్బ కారణంగా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఎండ వేడిమి మరింతగా పెరగవచ్చని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.