: నిన్న సిద్ధరామయ్య హాబ్లెట్ వాచ్... నేడు యడ్యూరప్ప ల్యాండ్ క్రూయిజర్ కారు!: కన్నడనాట ‘ఖరీదు’ వివాదాలు
కన్నడ నాట ఖరీదైన బహుమతుల వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హాబ్లెట్ వాచీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శల జడివానలో తడిసిముద్దయ్యారు. ఓ స్నేహితుడు తనకు ఆ వాచీని బహూకరించారని చెప్పిన ముఖ్యమంత్రి... విపక్షాల నుంచి పెను విమర్శలనే ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కూడా ఆయన ప్రశ్నల వర్షం ఎదుర్కొన్నారు. తదనంతరం సదరు వాచీని రాష్ట్ర ఖజానాకు ఆయన ఇచ్చేయడంతో సిద్ధరామయ్య దాదాపుగా ఆ వివాదం నుంచి బయటపడ్డారు. ఇక బీజేపీ కర్ణాటక చీఫ్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను ఇప్పుడు ఓ వివాదం చుట్టుముట్టింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే యెడ్డీ ఇంట రూ.1 కోటి ఖరీదు చేసే ల్యాండ్ క్రూయిజర్ వాహనం వాలిపోయింది. కన్నడనాట షుగర్ బ్యారన్ గా పేరుపడ్డ ప్రముఖ రాజకీయ నేత మురుగేశ్ నిరానీ ఈ వాహనాన్ని యెడ్డీకి బహూకరించారని స్వయంగా బీజేపీ నేతలే బహిరంగ ప్రకటన చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన యెడ్డీ వేలాది కిలో మీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు... అందుకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాహనం కావాల్సిందేగా? అంటూ సరికొత్త వాదనను వినిపిస్తున్నారు. సిద్ధరామయ్యను ‘హాబ్లెట్’ కేంద్రంగా చిక్కుల్లోకి నెట్టిన బీజేపీ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు యెడ్డీ ల్యాండ్ క్రూయిజర్ కేంద్రంగా విమర్శలు గుప్పించే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.