: టీడీపీలోకి బొబ్బిలి రాజు చేరిక మరోమారు వాయిదా!... ఈ నెల 20 చేరతారట!
బొబ్బిలి రాజవంశానికి చెందిన వైసీపీ నేత, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరిక మరోమారు వాయిదా పడింది. మొన్ననే సుజయ టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే నిన్న (ఈ నెల 15)న సుజయ... తన సోదరుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బేబి నాయనతో కలిసి టీడీపీలో చేరతారని మొన్న వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ నెల 18న ఆయన టీడీపీలో చేరుతున్నట్లు మళ్లీ వార్తలు వినిపించాయి. అయితే ఆ రోజు కూడా సుజయ టీడీపీలో చేరడం లేదట. ఈ నెల 20న సుజయ, బేబి నాయనలు టీడీపీలో చేరనున్నట్లు తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం సుజయ ఒక్కరే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పుట్టిన రోజైన ఈ నెల 20న సుజయ టీడీపీలో చేరిన తర్వాత మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలున్నట్లు సమాచారం.