: తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి...ఎల్లుండి నుంచే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల ధాటికి పట్టపగలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పది దాటిన తరువాత బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. దీంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు సూచించాయి. పిల్లలు, వయసు మళ్లినవాళ్లు ఎండల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల 16 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 13న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, ప్రతి ఏటా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండగా, పది రోజులు ముందుగానే ప్రారంభంకానుండడం విశేషం.