: బొబ్బిలి రాజులు ఈ నెల 18న టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు


బొబ్బిలి రాజులు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 18న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్నారు. కాగా, గతంలో టీడీపీకి బొబ్బిలి కంచుకోటగా వెలుగొందింది. పలుమార్లు టీడీపీ ఎంపీగా కొండపల్లి పైడితల్లినాయుడు విజయం సాధించారు. గతంలో టీడీపీ విప్ గా పని చేసిన శంబంగి వెంకట చినప్పలనాయుడు కూడా ఆ పార్టీ తరపున విజయం సాధించారు. తరువాతి క్రమంలో బొబ్బిలి రాజులు రాజకీయ రంగప్రవేశం చేయడంతో టీడీపీ కంచుకోట కాంగ్రెస్ వశమైంది. ఆ తర్వాత బొబ్బిలి రాజులు వైఎస్సార్సీపీలో చేరారు. వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మెలిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి బొత్స వైఎస్సార్సీపీలో చేరడంతో బొబ్బిలి రాజుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో గతంలోనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పటికీ జగన్ సర్దిచెప్పడంతో వారు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా ఆ పార్టీ నుంచి నేతలు టీడీపీలోకి వెళ్తున్న సందర్భంగా, వారితో జరిపిన సంప్రదింపులు ఫలించి, ఆయన పార్టీ మారుతున్నారు. రేపు ఆయన పార్టీ మారేందుకు ముహూర్తం నిర్ణయించారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ, ఈ నెల 18న ఆయన టీడీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఆయన చేరికతో బొబ్బిలి వైఎస్సార్సీపీ కార్యవర్గం మొత్తం టీడీపీలో చేరనుందని సమాచారం.

  • Loading...

More Telugu News