: సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడానా?... ఆయనింటికి వెళ్లి సమావేశమైన విజయసాయి, చెవిరెడ్డి


విజయనగరం బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరనున్నారని వార్తలు వచ్చిన వేళ, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర సైతం అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉదయం సుజయకృష్ణ రంగారావు మనసు మార్చేందుకు బొబ్బిలికి వచ్చిన వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులతో కలిసేందుకు ఆయన అంగీకరించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా నేతలంతా సాలూరుకు వెళ్లి రాజన్న దొరతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గురిచేసే ప్రలోభాలకు లొంగవద్దని, పార్టీ పరంగా ఏవైనా సమస్యలుంటే అధినేత జగన్ తో మాట్లాడి పరిష్కరించుకోవాలని వారు సూచించినట్టు సమాచారం. తానేమీ పార్టీ మారడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, రాజన్నదొరతో చర్చల అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీలు మారేవారు రాజీనామాలు చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఆపై ఇష్టమొచ్చిన పార్టీ టికెట్ తీసుకుని తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఫిరాయించిన వారు రాజీనామా చేసి గెలిస్తే, తాను పార్టీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పది మంది వెళ్లినంత మాత్రాన నష్టం లేదని, తిన్నింటివాసాలు లెక్కించే వారు లేకుంటేనే పార్టీ లాభపడుతుందని అన్నారు. జగన్ పై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News