: పాఠశాలల్లో డ్రెస్ కోడ్ పాటించాల్సిందే, సెల్ ఫోన్లూ ఉపయోగించొద్దు.. కడప టీచర్లకు కొత్త రూల్స్!
ఆదర్శభావాలతో హుందాగా కనిపిస్తూ ఉపాధ్యాయులు నడుచుకోవాలనే ఉద్దేశంతో కడప జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త నిబంధనలు విధించనున్నారు. ఈ విషయమై ఉపాధ్యాయులు వస్త్రధారణ, తదితర విషయాల్లో తమ తీరును మార్చుకోవాలని సూచిస్తూ ఆ జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు జీన్స్ ప్యాంట్, రంగురంగుల చొక్కాలు వేసుకోకూడదు. పని వేళల్లో ఉపాధ్యాయుల సెల్ ఫోన్లు ఉపయోగించడంపై కూడా నిషేధం విధించారు. ఈ నిబంధనలు కడప జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అనే అంశాన్ని మరిచిపోయిన ప్రభుత్వం, అవసరంలేని ఉపాధ్యాయుల డ్రెస్‌కోడ్, సెల్ఫోన్ల ఉపయోగంపై నిబంధనలు పెడుతోందని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.