: నేను ప్రత్యూషను కొట్టాను: రాహుల్ మాజీ ప్రేయసి!
బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణం తరువాత ఎక్కడ చర్చ జరిగినా, రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రేయసి సలోనీ శర్మ పేరు వినిపిస్తూనే ఉంది. ఈ మొత్తం ఘటనపై ఆమె తొలిసారిగా నోరు విప్పారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాను ప్రత్యూషను కొట్టిన మాట వాస్తమేనని చెప్పింది. అంతకన్నా ముందు రాహుల్, ప్రత్యూషలు తనపై చెయ్యి చేసుకున్నారని, అందుకే తాను అలా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి 11న రాహుల్ అక్కడ ఉన్నాడని తెలుసుకుని, తాను కాండివ్లీ అపార్టు మెంటుకు వెళ్లానని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. "నేను రాహుల్ కు ఇచ్చిన డబ్బును ఆయన ప్రత్యూషకు ఇచ్చాడు. తిరిగి డబ్బు చెల్లించాలంటే రాహుల్ వినలేదు. దాంతో నాకు కోపం వచ్చి డబ్బు కోసం నిలదీసేందుకు అక్కడికి వెళ్లాను. నన్ను చూడగానే రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయారు. ఇద్దరూ కలసి దాడి చేశారు. ఫ్లాట్ బయటకు నన్ను నెట్టేశారు. కోపంతో నేను ఆమెను కొట్టాను" అని చెప్పారు. ఆపై తాను పోలీసు కేసు పెట్టగా, వారిద్దరూ వచ్చి తనను బతిమాలుకున్నారని, పోలీసులు కూడా, ప్రజల దృష్టిలో పడాల్సి వస్తుందని హెచ్చరించడంతో కేసు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. మొత్తం ఉదంతంపై పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చానని సలోనీ శర్మ తెలిపారు.