: రాజంపేట మాజీ ఎంపీ గునిపాటి రామయ్య ఇక లేరు!
టీడీపీ సీనియర్ నేత, రాజంపేట మాజీ ఎంపీ గునిపాటి రామయ్య నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తుది శ్వాస విడిచారు. కడప జిల్లా రాజంపేట పరిధిలోని మంగంపేటలో నిరుపేద కుటుంబంలో జన్మించిన రామయ్య... టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా జరిగిన రామయ్య... 2014 ఎన్నికల్లో మళ్లీ క్రియాశీలకంగా మారి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్నారు. మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న రామయ్య... మెరుగైన చికిత్స కోసం ఇటీవలే హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.