: కారు కడిగినా...మొక్కలకు నీరు పోసినా 2 వేలు జరిమానా...ఛండీగఢ్ కార్పొరేషన్ నిర్ణయం
దేశంలోని కరవు పరిస్థితులను కళ్లకు కట్టే నిబంధనను కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగఢ్ మున్సిపల్ అధికారులు అమలులోకి తెచ్చారు. నీటిని వృథా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఉదయం 5:30 నిమిషాల నుంచి 8:30 గంటల వరకు కార్లు కడగడం, మొక్కలకు నీళ్లు పోయడం చేయకూడదని నిబంధన విధించినట్టు ఛండీగఢ్ పురపాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే ధావన్ తెలిపారు. ఈ నిబంధన అతిక్రమించిన వారికి రెండు వేల రూపాయల జరిమానా విధించనున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 15 నుంచి జూన్ 30 వరకు ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని ఆయన వెల్లడించారు. దీనిని పరిరక్షించేందుకు ముగ్గురేసి సభ్యులు గల 18 బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. వీరంతా ప్రజలు ఈ నిబంధన ఉల్లంఘించకుండా చూస్తారని, అలా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా విధించినప్పటికీ అలాగే చేస్తే... వారికి నీటి సరఫరా నిలిపేస్తామని ఆయన తెలిపారు.