: ‘పద్మవిభూషణ్’కు నేను ఎంపికైనప్పుడు నా ఆశ్చర్యానికి అవధులు లేవు: ‘ఈనాడు’ గ్రూపు చైర్మన్ రామోజీరావు


పద్మ విభూషణ్ పురస్కారాన్ని ‘ఈనాడు’ గ్రూప్ చైర్మన్ రామోజీరావు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. అనంతరం రామోజీరావు మాట్లాడుతూ, ‘పద్మవిభూషణ్ పురస్కారానికి నేను ఎంపికైనట్లు సమాచారం తెలిసినప్పుడు నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న నా నమ్మకాన్ని ఈ పరిణామం బలోపేతం చేసింది. నా దృష్టిలో పత్రికా రంగమనేది, ప్రజా సేవ చేసేందుకు అద్భుతమైన వేదిక. పాత్రికేయం పట్ల నాకున్న అభిరుచి నన్ను ఇంతటి గౌరవానికి అర్హుడిని చేయడం నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. నా మీడియాను విశ్వసించడమే కాకుండా నాపై అభిమానాన్ని కురిపించిన ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. ఈ సుదినం.. వారి అభిమాన ఫలమే. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆఖరి వరకు ప్రజాసేవలోనే తరించాలన్న నా నిశ్చయాన్ని ఈ అవార్డు మరింత బలపర్చింది. అందరికీ కృతఙ్ఞతలు’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News