: ఐపీఎల్ పోటీలు జరుగుతాయి... కోర్టులో రాజీ కుదుర్చుకున్న మహా సర్కారు, బీసీసీఐ
మహారాష్ట్రలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలగింది. స్టేడియంలో మైదానం, పిచ్ లను సిద్ధం చేసేందుకు తాగడానికి ఉపయోగపడని నీటిని మాత్రమే వాడుతామని బీసీసీఐ కోర్టుకు వెల్లడించడం, దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. ఈ సీజనులో మొత్తం 20 మ్యాచ్ లు మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్ నగరాల్లో జరగాల్సి వుండగా, తొలి మ్యాచ్ కి మాత్రం అనుమతించిన కోర్టు నేడు వాదనలు వింది. తాగునీటిని వృథా చేయాలన్న ఆలోచన తమకు లేదని, వేస్ట్ వాటర్ ను మాత్రమే వాడుకుంటామని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. మ్యాచ్ లను తరలించాలంటే వ్యయ ప్రయాసలు భరించాల్సి వుంటుందని, 'మహా' ప్రభుత్వానికి ఆదాయ నష్టమని తెలిపారు. ఆపై వృథా నీటిని వాడుతామంటే తమకు అభ్యంతరం లేదని ఫడ్నవీస్ సర్కారు తెలియజేయడంతో, మ్యాచ్ లను నిర్వహించుకోవచ్చని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది.