: అసోంకు నేనెంతో చేశాను... మోదీ అబద్ధాలు చెబుతున్నారన్న మన్మోహన్ సింగ్
అసోం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను, ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించడం వాస్తవ దూరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెబుతున్న విషయం మోదీ మనసుకు తెలుసునని అన్నారు. దీస్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన భార్య గురుశరణ్ కౌర్ తో కలసి ఓటేసేందుకు వచ్చిన మన్మోహన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము కాబట్టే అసోం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 15 ఏళ్ల పాటు అధికారాన్ని అప్పగించారని అన్నారు. రాష్ట్రానికి తానెంతో చేశానని చెప్పారు. కాగా, మన్మోహన్ సింగ్ 1991 నుంచి వరుసగా అసోం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న సంగతి తెలిసిందే. పీవీ నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అప్పటి అసోం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా రాజ్యసభ సీటును ఆఫర్ చేయగా, అప్పటి నుంచి ఆయన అసోంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హితేశ్వర్ సైకియా ఇంట్లోనే మన్మోహన్ సింగ్ అద్దెకు ఉంటున్నట్టు ఓటర్ల జాబితాలో ఉంది.