: పెరుగుతున్న వివాహపూర్వ ఒప్పందాలు... ముందుండి నడుస్తున్న టెక్కీలు!


బెంగళూరుకు చెందిన ఓ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్న శ్వేత (27) ఎంతో కాలంగా ప్రేమిస్తున్న యువకుడినే పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తరువాత విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఈ జంట పెళ్లికి ముందే ఇదే విషయాన్ని గురించి ఆలోచించింది. వివాహానికి ముందే వీరిద్దరూ ఓ అగ్రిమెంటుకు వచ్చారు. విడిపోయిన తరువాత తనకు ఉద్యోగం దొరకకుంటే, ఖర్చులను భర్త భరించాలన్నది ఈ అగ్రిమెంటులో ఉన్న ముఖ్య నిబంధన. దీంతో పాటు వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోరాదని, ప్రైవసీ ఉండాలని... ఇలా పలు నిబంధనలను వారు రాసుకుని సంతకాలు చేశారు. "వివాహం గొప్పతనానికి ఈ ఒప్పందం వ్యతిరేకమని నా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నా భవిష్యత్తు కోసం ఇది తప్పదని నేను వారికి నచ్చజెప్పాను. నా నిబంధనలను అతను అర్థం చేసుకున్నాడు" అని శ్వేత వెల్లడించింది. ఒక్క శ్వేత మాత్రమే కాదు... టెక్నాలజీ రంగంలో విధులు నిర్వహిస్తున్న వారిలో చాలా మంది ఇదే దారిలో వివాహానికి ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వికాస్ జోషి (31) సైతం ఇదే రీతిలో తన భార్యతో డీల్ కుదుర్చుకున్నాడు. "మేము చాలా కాలంగా స్నేహితులుగా ఉంటూ వచ్చాం. వివాహ బంధంతో ఒకటి కావాలని భావిస్తున్న వేళ, ఒకరిపై ఒకరికి గౌరవం పోకూడదన్న భావనతోనే ఒప్పందంపై సంతకాలు చేశాం. మా పెళ్లి రద్దయితే, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్నదే మా అభిమతం" అని చెప్పాడు. వాస్తవానికి 2005లో బెంగళూరులో 2,500 జంటలు విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయించగా, 2015లో ఆ సంఖ్య 7 వేలకు పెరిగింది. ఇదే సమయంలో వివాహపూర్వ ఒప్పందాల సంఖ్య కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో విడాకులు తీసుకోవాలని భావిస్తే, ఎవరికీ నష్టం కలుగకుండా చూసేందుకు ఈ ఒప్పందాలు ఉపకరిస్తున్నాయని ఫ్యామిలీ అడ్వొకేట్ జయనా కొఠారీ అభిప్రాయపడ్డారు. ముందుగానే కొన్ని నిబంధనలను అనుకోవడం వల్ల, ఆపై భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ, అగ్రిమెంటు ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుందని తెలిపారు. ఈ తరహా అగ్రిమెంటు కుదుర్చుకుని పెళ్లిళ్లు చేసుకున్న జంటల్లో గత యేడాది 10 మంది విడాకుల కోసం తన వద్దకు వచ్చినట్టు చెప్పారు. అయితే, భారత చట్టాల ప్రకారం, పెళ్లికి ముందు ఒప్పందాలు చట్టబద్ధం కాదని, వీటికి చట్టబద్ధతపై చర్చ జరగాల్సి వుందని మరో ఫ్యామిలీ లాయర్ రాకేష్ ప్రజాపతి వివరించారు.

  • Loading...

More Telugu News