: కొల్లం ప్రమాదానికి కారణం 'సన్ ఫ్లవర్' బాణసంచా!


నాలుగు గంటల పాటు సాగిన బాణసంచా ప్రదర్శన చివరకు వచ్చిందని భావించిన వేళ, జరిగిన ప్రమాదం 112 మంది ప్రాణాలు తీయగా, మరో 300 మందిని గాయాలు పాలు చేసిన ఘోర దుర్ఘటన నిన్న కేరళ జిల్లాలోని కొల్లం సమీపంలో జరిగిన సంగతి తెలిసిందే. అసలు ప్రమాదం జరగడానికి కారణమేంటి? దీనికి ఆ సమయంలో అక్కడే ఉండి తలకు గాయాలతో తప్పించుకున్న వినోద్ అనే యువకుడు పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. బాణసంచాలో అత్యంత ఆకర్షణీయమైన సన్ ఫ్లవర్ వెరైటీ (సూర్య కాంతి పేరిట తయారైన ప్రత్యేక రాకెట్) ప్రమాదానికి కారణమట. "దీన్ని కాల్చినప్పుడు వచ్చే వెలుగులను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. ఆలయానికి బాణసంచా వెరైటీలను ఓ మినీ వ్యాన్ లో తీసుకువచ్చారు. దీన్ని అప్పటికే ఆలయంలో బాణసంచా ఉంచిన గదికి దగ్గరలోనే ఉంచారు. సన్ ఫ్లవర్ ను కాల్చినప్పుడు అది వెళ్లాల్సిన ఎత్తు వెళ్లకుండానే పేలింది. దాని నిప్పురవ్వలు మినీ వ్యాన్ పై పడ్డాయి. అంతే... మినీ వ్యాన్ అంటుకుంది. ఏం జరుగుతోందో కొంతసేపు ఎవరికీ అర్థం కాలేదు. ఆపై అక్కడ ఉంటే ప్రమాదమని భావిస్తూ, ప్రజలు సహాయం కోసం అరుపులు, కేకలు పెడుతూ పరుగులు తీశారు. అక్కడే నిలిపి ఉంచిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించింది" అని వివరించాడు. ఆలయంలో సరైన బారికేడ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం కావడం కూడా మరణాల సంఖ్యను పెంచిందని 15 మంది అగ్నిమాపక సిబ్బందికి నాయకత్వం వహించిన స్టేషన్ ఆఫీసర్ పీ క్లీతస్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News