: సిద్దిపేట ఫలితాలు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే!
మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే నేటి ఉదయం వెలువడ్డ ఫలితాలు ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అచ్చంపేటలో విపక్షాలన్నీ జట్టుకట్టి టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలన్న యత్నం బెడిసికొట్టింది. అక్కడి ప్రజలు టీఆర్ఎస్ కు క్లీన్ స్వీప్ విజయం అందించి మద్దతు పలికారు. ఇక గ్రేటర్ హైదరాబాదులో మునుపెన్నడూ లేని రీతిగా పూర్తి స్థాయి మెజారిటీ సాధించడమే కాక, విపక్షాలు టీడీపీ, కాంగ్రెస్ లను సింగిల్ డిజిట్ కు పరిమితం చేసిన టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్ రావులకు సొంతూరైన సిద్దిపేటలో గ్రేటర్ కు మించిన ఫలితాలు వస్తాయని అంతా అంచనా వేశారు. ఈ క్రమంలో సిద్దిపేటకు జరిగిన ఎన్నికల్లో ఆదిలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి గళం ఎగసింది. టికెట్లు దక్కలేదన్న కారణంతో పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అంతేకాకుండా ఎన్నికల్లో స్వతంత్రులు ఏకంగా ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీకి ఏమాత్రం జనాదరణ లేదన్న టీఆర్ఎస్ వాదన... కేసీఆర్ సొంతూళ్లోనే తప్పని తేలింది. సిద్దిపేట మునిసిపాలిటీలో బీజేపీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మజ్లిస్ పార్టీ కూడా ఓ స్థానాన్ని దక్కించుకుని సిద్దిపేటలో బోణీ కొట్టింది. తెలంగాణలో జీవం లేని పార్టీగా మారిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ రెండు సీట్లు దక్కాయి. వెరసి ఇదివరకు జరిగిన మునిసిపల్ ఎన్నికల కంటే తనకు కంచుకోటగా ఉన్న సిద్దిపేటలోనే టీఆర్ఎస్ అంతగా రాణించలేకపోయింది. మునిసిపాలిటీని దక్కించుకున్నప్పటికీ... స్వతంత్రులు, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ లకూ అక్కడ సీట్లు లభించడంతో టీఆర్ఎస్ కు ఆశించిన మేర ఫలితాలు రాలేదనే చెప్పాలి.