: 112కు చేరిన ‘పుట్టింగల్’ మృతుల సంఖ్య... పోలీసుల అదుపులో ఆలయ నిర్వాహకులు
కేరళలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన పెను ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 112కు చేరింది. బాణాసంచా పేలుడు కారణంగా నిన్న తెల్లవారుజామున ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోతున్న వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతూ వస్తోంది. నిన్న రాత్రి పొద్దుపోయే సమయానికి 106 మంది చనిపోగా, నేడు తెల్లవారేసరికి ఆ సంఖ్య 112కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 300 మందికి పైగా క్షతగాత్రుల్లో ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది. క్షతగాత్రులను తొలుత కొల్లం పరిధిలోని ఆసుపత్రులకు తరలించిన సహాయక సిబ్బంది... పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా తిరువనంతపురానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాదాన్ని సీరియస్ గా పరిగణించిన కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ నిర్వహణ కమిటీకి చెందిన ఐదుగురిని నిన్న రాత్రే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై వారిని పోలీసులు విచారిస్తున్నారు.