: సంస్కృతిలో భాగం... బాణసంచాను నిషేధించలేం: ట్రావెన్ కోర్ దేవస్థానం
కేరళలోని దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్న వేళ, బాణసంచా కాల్చడం సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైపోయిందని, బాణసంచాను నిషేధించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. నిన్న కొల్లంలోని పుట్టింగళ్ దేవి ఆలయంలో భారీ ఎత్తున బాణసంచా అంటుకుని 112 మంది మరణించిన ఘోర దుర్ఘటన అనంతరం, బోర్డు అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు. దుర్ఘటన వెనుక పోలీసుల వైఫల్యం లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల తెలియజేశారు. పోలీసులు బాణసంచా ప్రదర్శనను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, 'లక్షలాది మంది గుమికూడి ఉన్న ప్రాంతంలో, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అన్ని విధాలుగా పరిస్థితిని పరిశీలించాల్సి వుంటుంది కదా?' అని అన్నారు. కాగా, నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొల్లాంను సందర్శించనున్నారు.