: జ్యోతుల ఇలాకాలో వైసీపీ ఖాళీ!... గ్రామస్థాయి నేతలూ జ్యోతుల వెంటే టీడీపీలోకి!


ఏపీలో విపక్ష వైసీపీకి నేడు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పార్టీలో సీనియర్ నేతగా ఎదిగిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేడు తన కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం సహా ఏపీ అసెంబ్లీలో వైసీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేసిన జ్యోతుల... తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందరిలా కాకుండా విభిన్నంగా తన సత్తా చాటుతూ టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని జ్యోతుల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ... తదితర గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా తన వెంట టీడీపీలోకి తీసుకెళ్లేందుకు జ్యోతుల నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంపై మంచి పట్టున్న జ్యోతుల వెంట నడిచేందుకు జగ్గంపేట పరిధిలోని కింది స్థాయి ప్రజా ప్రతినిధులు కూడా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు టీడీపీలోకి జ్యోతుల చేరిక అట్టహాసంగా జరగనుంది. మద్దతుదారులతో కలిసి నేడు జగ్గంపేట నుంచి బయలుదేరనున్న జ్యోతుల నెహ్రూ విజయవాడ చేరుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు జ్యోతుల వెంట టీడీపీలోకి చేరుతుండటంతో జగ్గంపేటలో వైసీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. వెరసి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రం కూడా మారిపోనుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News