: వైజాగ్ లో టాకేంటని అడుగుతాను: రకుల్ ప్రీత్ సింగ్
నటులకు ఎలాంటి పాత్ర సూటవుతుందన్నది దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 'సరైనోడు' విజయోత్సవ వేడుకలో రకుల్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పింది. ఈ విషయం గతంలో చాలా సార్లు చెప్పినప్పటికీ మళ్లీ చెబుతున్నానని తెలిపింది. అల్లు అర్జున్ తో పని చేసిన తరువాత ఆయనపై మరింత గౌరవం పెరిగిందని చెప్పింది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అల్లు అర్జున్ ను చూసి నేర్చుకోవాలని రకుల్ వెల్లడించింది. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. చిరంజీవి గారితో పనిచేసే అవకాశం తనకు 'బ్రూస్ లీ' సినిమాలో దక్కిందని, ఆయనతో పని చేయడం ఎవరికైనా గర్వకారణమేనని రకుల్ పేర్కొంది. తమన్ మంచి సంగీతం అందించాడని రకుల్ తెలిపింది. వైజాగ్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని చెప్పింది. తన సినిమా రిలీజ్ అయితే వైజాగ్ లో టాక్ ఎలా ఉంది? అని ముందుగా అడిగి తెలుసుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.