: పంజాబ్ వరుడి కొంప ముంచిన బీహార్ మద్యనిషేధం!


పంజాబ్ వరుడికి, బీహార్ మద్యనిషేధానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి... ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే...పంజాబ్ అమృతసర్ కు చెందిన మన్ దీప్ సింగ్ (26) కు పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహం కోసం అమృతసర్ నుంచి చిన్ననాటి స్నేహితుడు బచితర్ సింగ్ (28) తో కలిసి పంజాబ్ మెయిల్ లో థర్డ్ ఏసీలో వెళ్తున్నాడు. వివాహానికి వెళ్తున్నానన్న ఉత్తేజంతో రైల్లోనే మిత్రుడితో కల్సి పార్టీ చేసుకోవడం ప్రారంభించాడు. అయితే, ట్రైన్ బీహార్ లో ప్రవేశించినా వీరి పార్టీ ఆగలేదు. వీరి వ్యవహారం చూసిన సహప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దనాపూర్ వద్ద రైల్వే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.23 లక్షల రూపాయల నగదు, ఐఎమ్ఎఫ్ఎల్ ఓపెన్ బాటిల్, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు ఇండియన్ రైల్వే యాక్ట్, బీహార్ నూతన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశారు. వీరికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో వీరి శరీరంలో మద్యం శాతం ఎక్కువ ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వారు వెల్లడించారు. పాపం, కొత్త పెళ్లికొడుకుగారు మద్య నిషేధానికి అలా బుక్కయిపోయారు!

  • Loading...

More Telugu News