: కత్తి చేతబట్టి చిందులు తొక్కిన గుజరాత్ మాజీ పోలీసధికారి వంజారా!... వీడియో వైరల్
దేశంలోనే అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా ముద్ర వేయించుకున్న గుజరాత్ మాజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీ వంజారా నిన్న కత్తి చేతబట్టి చిందులు తొక్కారు. నకిలీ ఎన్ కౌంటర్ కేసులో పడ్డ శిక్షను పూర్తి చేసుకున్న ఆయన నిన్న విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ హీరోకు లభించినంత స్థాయిలో ఘన స్వాగతం లభించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన వంజారాకు ఆయన కొడుకు ఓ మెర్సిడెజ్ బెంజ్ కారును బహూకరించారు. అహ్మదాబాదు ఎయిర్ పోర్టు నుంచి ఈ కారులోనే గాంధీ నగర్ కు చేరుకున్న వంజారా టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వంజారా తన కొడుకు ఇచ్చిన సిల్వర్ కత్తి చేతబట్టి చిందులు తొక్కారు. వంజారా ఉత్సాహం చూసిన ఆయన అభిమానులు, బంధుగణం కూడా వంజారాతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ తతంగం మొత్తాన్ని రికార్డు చేసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు మీడియాకూ అందజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.