: మైనర్ కొడుకు తప్పుకు తండ్రి మూల్యం!... ఢిల్లీ 'హిట్ అండ్ రన్' కేసులో తండ్రి అరెస్ట్
మైనారిటీ తీరని కొడుక్కి కోట్ల ఖరీదైన కారు ఇవ్వడమే ఆ తండ్రి చేసిన తప్పైంది. కొడుకుపై చూపిన ఆ అతి ప్రేమే ఇప్పుడు ఆ తండ్రిని కటకటాల పాలు చేసింది. ఇలా కొడుకు చేసిన తప్పుకు తండ్రి అరెస్టైన ఘటనకు మొన్న ఢిల్లీ నడి వీధుల్లో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు వేదికగా నిలిచింది. వివరాల్లోకెళితే... ఇటీవల ఢిల్లీ నడి వీధుల్లో మెర్సిడెజ్ బెంజ్ కారుతో ప్రత్యక్షమైన 17 ఏళ్ల మైనర్ బాలుడు వేగంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు దాటుతున్న సిద్ధార్థ వర్మ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారును ఆపకుండానే ఆ బాలుడు ముందుకు దూసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఈ ప్రమాద దృశ్యాలను రికార్డు చేశాయి. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సోదరి నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా మైనారిటీ తీరని కొడుకు చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అతడి తండ్రి మనోజ్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అగర్వాల్ కొడుకు ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం ఇదే కొత్త కాదట. సదరు కారుపై ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించి గతేడాది రెండు కేసులు, తాజాగా ఈ ఏడాది మార్చి 3న మరో కేసు నమోదైందట.