: ఆకాశంలో 85 విమానాలు, 25 వేల మంది ప్రాణాలు గాల్లో... కోల్ కతా విమానాశ్రయంలో ఈ ఉదయం పది నిమిషాల పాటు యమా టెన్షన్!
కోల్ కతా విమానాశ్రయంలోని ఏటీసీ టవర్. మొత్తం 85 విమానాలు గాల్లో ఎగురుతూ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సంబంధాలు పెట్టుకుని ఉన్నాయి. వీటిల్లో మొత్తం 25 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా అయోమయం, కలకలం. ఏటీసీతో అన్ని విమానాల సంబంధాలూ తెగిపోయాయి. రాడార్లు పనిచేయడం మానేశాయి. వీహెచ్ఎఫ్ (వెరీ హై ఫ్రీక్వెన్సీ) లింకులు తెగిపోయాయి. పది నిమిషాల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఏటీసీ సెంటర్ లో పనిచేస్తున్న 35 మంది కంట్రోలర్లు ఈ సమాచారాన్ని దగ్గరి విమానాశ్రయాలకు చేర్చేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. "ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎక్కడ ఏ అనర్థం జరుగుతుందోనని భయం. ల్యాండ్ లైన్లు కూడా పనిచేయలేదు. కానీ అదృష్టవశాత్తూ నాగపూర్, వారణాసి ఏటీసీలను కాంటాక్టు చేసి పైలట్లకు సమాచారాన్ని ఇవ్వగలిగాం" అని ఓ కంట్రోలర్ తెలిపారు. పరిస్థితి ఇంకొంచెం అదుపుతప్పినా భయంకర విమాన ప్రమాదాలు చూడాల్సి వచ్చేదని ఓ కంట్రోలర్ తీవ్ర ఆందోళన మధ్య వ్యాఖ్యానించారు. ఉదయం 7:35 గంటల సమయంలో సమస్య తలెత్తిందని, విమానాలను చూపుతున్న మానిటర్లు ఒక్కసారిగా ఆగిపోయాయని, ఏం జరుగుతుందో అర్ధం కాలేదని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో విచారణ జరుపుతామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు రాడార్లు పనిచేయలేదు. నార్త్ 24 పరగణాలు, ఒడిశాలోని బెర్హంపూర్ విమానాశ్రయాల్లోని సెకండరీ రాడార్ల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని ల్యాండింగ్ విమానాలకు సమాచారం ఇవ్వాల్సి వచ్చిందని ఎయర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఉదయం 9:15 గంటల సమయంలో బీఎస్ఎన్ఎల్ తన ఫోన్ లింకులను రీస్టోర్ చేయడంతో తిరిగి విమానాల నియంత్రణ సాధ్యమైనట్టు తెలుస్తోంది.