: అతన్ని చూసి ఆమె భయపడిందట... అంతే, అతన్ని విమానం నుంచి దించేశారు!


రోమ్ విమానాశ్రయంలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా ప్రయాణికురాలు తన పక్కన కూర్చున్న ప్రయాణికుడిని చూసి భయపడడంతో సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దించేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే... రోమ్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఈజీ జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ఎక్కేందుకు యెమనే అనే వ్యక్తి విమానాశ్రయానికి చేరుకున్నాడు. చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బయల్దేరబోయే విమానంలో ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో కెప్టెన్ డోర్ దగ్గరకు వచ్చి, యెమనే అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. తన లగేజ్ ఏమైనా మర్చిపోయానేమోనని భావించిన యెమనే...తానే అంటూ చేయిపైకెత్తాడు. దీంతో డోర్ వద్దకు రావాలని కెప్టెన్ సూచించాడు. దీంతో యెమనే అక్కడికి వెళ్లగానే విమానం దిగిపోవాలని సూచించాడు. ఎందుకని ప్రశ్నించడంతో 'నీ పక్కసీట్లో ఉన్న మహిళకు నువ్వేమైనా చేస్తావేమోనని అనుమానం వచ్చింది. అందుకే, నువ్వు విమానం దిగిపో' అని కెప్టెన్ సూచించాడు. దీంతో షాక్ కు గురైన యెమనే...అనుమానం ఆమెకు వస్తే ఆమె దిగిపోవాలి కానీ, తనను దిగమనడం ఏంటని ప్రశ్నించాడు. సుమారు అరగంటసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం పెరగడంతో యెమనేను పోలీసులకు అప్పగించారు. విచారణ పేరుతో అతనిని 15 గంటలపాటు ఎయిర్ పోర్టులో ఉంచేసిన అధికారులు, అతని వల్ల ప్రమాదమేమీ లేదని భావించి, వేరే విమానంలో పంపించారు.

  • Loading...

More Telugu News