: భవిష్యత్ బాగుంటుంది... కాంగ్రెస్ వల్లే సమస్యలు: తాజా సర్వేలో మోదీకి మార్కులేసిన ప్రజలు!


'అచ్చే దిన్' (మంచి రోజులు) దగ్గర చేస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీకి ఇది శుభవార్తే. భారత మధ్యతరగతి ప్రజల్లో అందునా, పట్టణ ప్రాంతాల్లోని వేతన జీవుల్లో ఆయనపై ఉన్న నమ్మకం ఎంతమాత్రమూ తగ్గలేదని ఇటీవల ఈటీ-టీఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని 86 శాతం మంది, కొత్తగా ఉద్యోగ సృష్టి జరిగిందని 62 శాతం మంది, భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వల్లే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీలో గొడవలకు కాంగ్రెస్ కారణమని 46 శాతం మంది వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 52 శాతం మంది ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఇక వ్యక్తిగత పాప్యులారిటీ విషయానికి వస్తే, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో పోలిస్తే, నరేంద్ర మోదీ ఎంతో ఎత్తున ఉన్నారు. మోదీ 10 పాయింట్లకు గాను 7.68 పాయింట్లు తెచ్చుకోగా, రాహుల్ కు 3.61 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది మోదీకి 10కి 9 మార్కులేశారని ఈటీ-టీఎన్ఎస్ వెల్లడించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర 7 మెట్రోల్లో సర్వే నిర్వహించామని, 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిని ఇందులో భాగం చేశామని పేర్కొంది. రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాల్లోని వారిని ప్రశ్నించామని, సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News