: ఆర్టీసీ ‘కూల్' ప్లాన్!... బస్సుల్లో కూలర్లను అమర్చుతున్న టీఎస్సార్టీసీ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా రోజూ పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే తప్పించి, బయటకు రావద్దని జనానికి వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నరకప్రాయమే. మరి జనం లేకుండా బస్సులనెలా నడిపేది? అన్న భావన తెలంగాణ ఆర్టీసీకి వచ్చింది. అంతే... ఆ సంస్థ ‘కూల్ ప్లాన్’ రచించింది. ఇందులో భాగంగా ప్రధాన రూట్లలో రాకపోకలు సాగించే బస్సుల్లో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ప్లాన్ అమల్లోకి వచ్చేసింది. ఈ ప్లాన్ ప్రకారం బస్సులో ముందు భాగంలో ఓ ఎయిర్ కూరల్, మధ్యలో మరో కూలర్ ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని బస్సుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ కూలర్లు ప్రయాణికులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.