: క్లైమాక్స్ దశలో హృతిక్, కంగనా వివాదం ఎపిసోడ్!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ బ్రేకప్ అవడం.. వారిద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరి పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకోవడం తెలిసిందే. పోలీసుల జోక్యం, విచారణతో ఈ వివాదం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. పోలీసుల విచారణలో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ తమ వాదనలు వినిపించారు. అయితే కంగనాపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హృతిక్ పంపిన లీగల్ నోటీసుకి సమాధానంగా మరో లీగల్ నోటీస్ పంపిన కంగనా.. దాంట్లో ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. తర్వాత తన అకౌంట్‌ను హృతిక్ హ్యాక్ చేసి.. తన విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్ అన్నీ డిలీట్ చేశాడని ఆమె ఆరోపించింది. కాగా, ఇప్పుడు ఈ విషయమై దర్యాప్తు కోసం కంగనా ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకోవాలని పోలీసు అధికారులు భావించారు. అయితే వైరస్ కారణంగా అందులో సమాచారం అంతా డిలీట్ అయిపోయినట్టు తెలుపుతూ.. తన ల్యాప్ టాప్‌ను పోలీసులకు ఇచ్చేందుకు కంగనా నిరాకరించింది. దీంతో హృతిక్ రోషన్‌ను ఈ కేసు నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిద్దరి వివాదం ఎపిసోడ్‌కు క్లైమాక్స్ సీన్ వచ్చేసిందని బాలీవుడ్ టాక్.