: ఆత్మవిశ్వాసంతో ప్రతికూల ఆలోచనలను తరిమేద్దాం!
నిత్య జీవనంలో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. ఆ సమయంలో ప్రతికూల ఆలోచనలు సమస్యలను జటిలం చేస్తాయి. మనలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, సరైన క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే మనచుట్టూ ఉన్న విజయావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. 'నాపై నాకు ద్వేషం ఉంది' అనే ప్రతికూల భావనను మీలో రానీయకండి. అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. మీలో మీకు నచ్చని విషయాలు కొన్ని ఉండే వుంటాయి. వాటిని ఒక్కసారిగా వదిలించేసుకోవాలని తొందరపడి నిరాశపడకండి. వాటిని కొద్ది కొద్దిగా తగ్గించుకోండి. మీ లోపాలను గ్రహించి ఎలాంటి సంకోచం లేకుండా వాటిని పారదోలడానికి ప్రయత్నించండి. విజయం అన్న పదానికి చేరువయే ప్రయత్నంలో సానుకూల దృక్పథం అనే అంశం తప్పనిసరి. మనిషి ప్రస్తుతం అనేక విషయాల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. ఓటమి, గెలుపు అనేవి నాణేనికి రెండు పైపులా ఉండే అంశాలు. ప్రతీసారీ గెలుపు మాత్రమే రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. మనం ఏ విషయంలో విజయాన్ని ఆశిస్తున్నామో, ఆ విషయంలో తప్పకుండా విజయం సాధించి తీరుతాం అని నమ్ముతూనే.. చివరగా గెలుపు, ఓటమి.. ఏ ఫలితం వచ్చినా ఒకేలా తీసుకోవడం మరో విజయానికి పునాది వేస్తుంది. విజయాల్ని సాధించాలంటే మానసిక ధైర్యం కావాలి. మానసిక ధైర్యమే మనకు విజయాల్ని అందిస్తుంది. ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండాలంటే గొప్ప వ్యక్తుల విజయగాధలు చదవండి. యోగా, ప్రాణాయామ పద్ధతులను కొద్ది సేపయినా పాటించండి. మీరు ఒంటరి అని తలచకండి. మీ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయి మాట్లాడండి. మీ బెస్ట్ ఫ్రెండ్‌తో మీకున్న సమస్యలు చెప్పుకుంటే కాస్తయినా మీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ప్రతి మనిషికీ తనపై తనకు నమ్మకం ఉండటం చాలా అవసరం. స్వీయ నిర్ణయం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శక్తిమంతమైన నిర్ణయాలతో జీవితాన్ని మార్చుకోవచ్చు. ఉక్కులాంటి దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యం దిశలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఎదిరించండి. ప్రతీ సమస్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.