: భావోద్వేగాల ఆధారంగా తీర్పు ఇవ్వాలా?... ‘రోహిత్ వేముల’ కేసులో పిటిషనర్ కు హైకోర్టు మొట్టికాయ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ పొదిలె అప్పారావు సహా ఈ వ్యవహారంలో తలదూర్చిన మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోహిత్ వేములకు మద్దతుగా నిలిచిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం విచారించిన కోర్టు... ఎమోషన్స్ (భావోద్వేగాలు) ఆధారంగా తీర్పులివ్వాలా? అంటూ పిటిషనర్ కు మొట్టికాయలేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్ ను ఆధారం చేసుకుని వీసీ, మంత్రులపై చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించని కోర్టు... ఏ నిబంధనల మేరకు వీసీని తొలగించాలో చెప్పాలంటూ పిటిషనర్ ను నిలదీసింది. అయినా కేసుపై పూర్తి స్థాయి అధ్యయనం లేకుండానే పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఆ తర్వాత కాస్తంత శాంతించిన కోర్టు... దీనిపై పూర్తి స్థాయి అధ్యయనంతో వస్తే సోమవారం పిటిషన్ పై వాదనలు వింటామని పిటిషనర్ కు మరో అవకాశం కల్పించింది.