: హెచ్ సీయూలో హైటెన్షన్... అకడమిక్ కౌన్సిల్ భేటీపై విద్యార్థుల ఆగ్రహం, భారీగా బలగాల మోహరింపు
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో నిప్పుల కుంపటిలా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు సుదీర్ఘ సెలవు ముగించుకుని మళ్లీ విధుల్లో చేరిపోయారు. మరికాసేపట్లో ఆయన నేతృత్వంలో వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని అడ్డుకుని తీరతామని వర్సిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. విద్యార్థుల జేఏసీకి పది వామపక్షాలు మద్దతు పలికాయి. మరికాసేపట్లో వర్సిటీకి ర్యాలీగా బయలుదేరేందుకు వామపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యల కింద వర్సిటీలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కౌన్సిల్ భేటిని నిర్వహించి తీరతామని వీసీ అప్పారావు, అడ్డుకుంటామని విద్యార్థు ప్రకటనల నేపథ్యంలో మరోమారు వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.