: చంద్రబాబు భద్రత డొల్ల!... సీఎం నివాసానికి కూతవేటు దూరంలో మావోయిస్టు!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో నిషేధిత మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. విజయవాడకు సమీపంలో కృష్ణా నది ఆవలి వైపున గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా తాత్కాలిక రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం అక్కడికి సమీపంలోని తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని కృష్ణా కరకట్టలపై అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. అక్కడే ఉంటున్న ఆయన విజయవాడ నుంచి పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నివాసానాకి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ఓ మహిళా మావోయిస్టు సంచారం కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగి మహిళా మావోయిస్టు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త బాలస్వామి కూడా పోలీసులకు దొరికిపోయాడు. అనారోగ్యంతో సతమతమవుతున్న అరుణ... తాళ్లాయపాలెంలోని తన సోదరి ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోకి మహిళా మావోయిస్టు ఎంట్రీ ఇవ్వడంతో పోలీసులు షాకయ్యారు. అనారోగ్యానికి చికిత్స చేయించుకునేందుకే ఆ మహిళా మావోయిస్టు వచ్చినప్పటికీ... చంద్రబాబు, ఇతర కేబినెట్ మంత్రులు నిత్యం సంచరించే ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత ఉన్నా, నాలుగు రోజుల దాకా విషయం బయటకు పొక్కకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు.