: తమిళనాట కలకలం!... పరీక్షలు ముగిసిన తర్వాత 100 మంది అమ్మాయిలు అదృశ్యం!
ఎన్నికల వేడి రాజుకున్న తమిళనాడులో నిన్న పెను కలకలం రేగింది. ఇంటర్ పరీక్షలు రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయిల్లో వందమంది అడ్రెస్ గల్లంతైంది. ఈ మేరకు తమిళనాడు వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వంద ఫిర్యాదులు నమోదయ్యాయి. వివరాల్లోకెళితే... గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ప్లస్ టూ (ఇంటర్) పరీక్షలు గత శుక్రవారం ముగిశాయి. అప్పటిదాకా పరీక్షలు రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన అమ్మాయిలు పరీక్షలు ముగియగానే ఇంటికొచ్చేవారు. అయితే శుక్రవారం చివరి పరీక్ష ముగిసిన తర్వాత దాదాపు వంద మంది అమ్మాయిలు తమ ఇళ్లకు మళ్లీ తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రస్తుతం తమిళనాడులో కట్టుదిట్టమైన బందోబస్తు అమల్లోకి వచ్చింది. అయినా వంద మంది అమ్మాయిలు అదృశ్యం కావడం పోలీసులకు పెను సవాలుగా మారింది. అయితే ఇలా పరీక్షలు ముగియగానే అమ్మాయిలు అదృశ్యమవుతున్న ఘటనలు ఈ ఏడాదే కొత్తేమీ కాదని పోలీసులు పాత రికార్డులు తిరగేసి మరీ చెబుతున్నారు. గతేడాది ప్లస్ టూ పరీక్షలు ముగిసిన తర్వాత 125 మంది అమ్మాయిలు పరారయ్యారు. వీరిలో 60 శాతం మంది ప్రేమించిన వ్యక్తుల వెంట వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆ తర్వాత తేలింది. ఈ ఏడాది కూడా ఆ తరహాలోనే ప్రేమికుల వెంటే అమ్మాయిలు వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.