: రేపు పట్టాలెక్కనున్న ఫాస్టెస్ట్ ట్రెయిన్ ‘గతిమన్’... దీని ప్రత్యేకతలు!
భారతీయ రైల్వేస్ లో రేపు చరిత్రలో నిలిచిపోయే రోజు కానుంది. మన దేశపు ఫాస్టెస్ట్ ట్రెయిన్ గతిమన్ ఎక్స్ ప్రెస్ రేపు పట్టాలెక్క నుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు గాను న్యూఢిల్లీ- ఆగ్రా కాంట్ మధ్య ఈ రైలును ప్రవేశపెట్టనున్నారు. న్యూఢిల్లీ లోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రేపు జెండా ఊపి ప్రారంభించనున్నారు. షెహనాయ్ వాయిద్యం నేపథ్యంలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు గాను ఈ రైలును ప్రవేశపెడుతున్నారు. గతిమన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతల విషయానికొస్తే... * గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు * 200 కిలోమీటర్లు దూరాన్ని 100 నిమిషాల్లో చేరుకుంటుంది * రెండు ఎగ్జిక్యూటివ్ ఏసి చైర్ కార్లు * 8 ఏసీ చైర్ కార్ కోచ్ లు * ప్రయాణికులకు గులాబీలతో స్వాగతం పలుకనున్న ట్రెయిన్ హోస్టెస్ * వైఫై, సినిమాలు, టీవీ షోలు, వీడియో గేమ్స్, న్యూస్, కార్టూన్స్ వంటి మల్టీ మీడియా ఎంటర్ టెయిన్ మెంట్ * ప్రయాణికుల కోసం ఇండియన్, కాంటినెంటల్ ఆహార పదార్థాలు, ఇతర ఆహార పదార్థాలు * హై-పవర్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలార్మ్ * ప్రయాణికులకు జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ * ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు * ఎగ్జిక్యూటివ్ క్లాసులో టిక్కెట్ ధర రూ.1,365 కాగా, చైర్ కార్ లో టిక్కెట్ ధర రూ.690గా ఉంది. నిజాముద్దీన్- ఆగ్రా- నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య వారంలో ఆరు రోజులు తిరిగే ఈ ట్రెయిన్, శుక్రవారం మాత్రం ఉండదు. ఎందుకంటే, ఆ రోజు ఆగ్రాలో తాజ్ మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతించరు కనుక ఆ ఒక్కరోజు ఈ ట్రెయిన్ ను నడపరు. ఆయా రోజుల్లో గాటిమన్ ఎక్స్ ప్రెస్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలు దేరి ఆగ్రా కాంట్ కు 9.50 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి 7.30 గంటలకు నిజాముద్దీన్ స్టేషన్ కు చేరుతుంది. కాగా, ఈ తరహా రైళ్లను తొమ్మిది మార్గాల్లో భవిష్యత్తులో ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు చేస్తోంది. కాన్పూర్-ఢిల్లీ, చండీగఢ్- ఢిల్లీ, హైదరాబాద్- చెన్నై, నాగపూర్- బిలాస్ పూర్, గోవా- ముంబయితో పాటు నాగపూర్-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ తరహా రైళ్లను సమీప భవిష్యత్తులో ప్రవేశ పెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.