: పనామా పేపర్స్ పై దర్యాప్తు చేస్తాం: ప్రాంకోయిస్ హోలాండే
ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణాన్ని బయటపెట్టిన పనామా పేపర్స్ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తెలిపారు. పనామా పేపర్స్ పేరుతో ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చినవారికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. పన్నులు ఎగవేసి లక్షల కోట్లు వెనకేసుకుంటున్న బడాబాబుల బండారం ఈ పత్రాల ద్వారా బయటపడడంతో, ఆయా వ్యక్తులు ఈ వార్తలను ఖండించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పత్రాల్లో పలువురు ప్రముఖుల పేర్లు ఉండడంతో పత్రికలన్నీ పనామా పేపర్స్ వార్తలతో నిండిపోయాయి. కాగా, ఏడాది క్రితం జర్మనీలోని సిడియుష్ జీతంగ్ పత్రికా కార్యాలయానికి ఓ వ్యక్తి ఓ ఫైల్ ను పంపించాడు. వీటిని పంపిన సందర్భంగా పనామా పేపర్స్ కు సంబంధించిన మొత్తం సమాచారం అందిస్తానని, తనకు ప్రాణభయం ఉండడంతో ఏదో ఒక మార్గంలో రహస్యంగా అందజేస్తానని ఆయన చెప్పాడని వీటిని లీక్ చేసిన సంస్థ చెబుతోంది. అలా చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటని వారు ప్రశ్నించగా, వీరి నేరమయ జీవితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ముందున్న కర్తవ్యమని ఆయన చెప్పడం విశేషం. ఈ పేపర్లను పరిశీలించిన జర్నలిస్టుల మతిపోయింది. దీంతో ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ కన్సార్టియంతో చర్చలు జరిపి, దర్యాప్తు సమాచారం లీక్ కాకుండా జాగ్రత్త పడుతూ లక్షలాది పేపర్లను క్రోడీకరించి సమాచారం సేకరించి, బట్టబయలు చేశారు. దీంతో పలు దేశాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. భారత్ లో 500 మంది పేర్లను బట్టబయలు చేయగా, అందులో అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు ఉండడం తెలిసిందే.