: మా అబ్బాయి ఇచ్చిన కానుక ఇది!: షారూఖ్ ఖాన్
తన పిల్లల భవిష్యత్తుపై ఎంతో శ్రద్ధ కనబరుస్తూ, వారిని నిరంతరం ప్రోత్సహించే బాలీవుడ్ స్టార్స్‌లో ముందుగా చెప్పుకునే పేరు షారూఖ్ ఖాన్. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ అయినా.. కుటుంబ బాధ్యతలను ఏమాత్రం విస్మరించడు షారూఖ్. ఎదుగుతున్న కుమారుడికి తండ్రి చేరువగా ఉండడం ఎంత అవసరమో తెలియజేస్తూనే ఉంటాడు. ఇప్పటికే తన పిల్లల గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు పంచుకున్నాడు. తాజాగా తన పెద్దకొడుకు ఆర్యన్ ఓ కానుక ఇచ్చాడంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు. త్వరలో షారుఖ్ తాజా సినిమా 'ఫ్యాన్' విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో టైటిల్ సాంగ్ 'జబ్రా ఫ్యాన్'ను గిటార్ మీద అద్భుతంగా వాయించాడు అర్యన్. ఆ వీడియోను తాజాగా షారుఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 'నా అబ్బాయి నా కోసం ఇది చేశాడు. నాకు కూడా గిటార్ వాయించడం వచ్చుంటే ఎంత బాగుండునో' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.