: 'భారత్ మాతాకీ జై' వ్యాఖ్యలపై మహా సీఎం ఫడ్నవీస్ యూటర్న్!
'భారత్ మాతాకీ జై' అననివాళ్లు ఇండియాలో ఉండేందుకు వీలులేదని ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తనపై వచ్చిన విమర్శలతో యూటర్న్ తీసుకున్నారు. నష్ట నివారణ దిశగా తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. భారతీయులు 'జై హింద్' అన్నా, 'జై హిందుస్థాన్' అన్నా అభ్యంతరం లేదని, ఎవరైనా 'నేను భారత్ మాతాకీ జై అనను' అంటే మాత్రం సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన అన్నారు. భారత మాతకు జై కొట్టకపోయినా ఫర్వాలేదని, ఆమాట అనను అని బయటకు చెబితే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కాగా, భారత ఉపఖండంలో ప్రముఖ ఇస్లాం సమాజాల్లో ఒకటైన దారుల్-ఉలూమ్ దియోబంద్ ఇటీవల ఓ ఫత్వా జారీ చేస్తూ, ముస్లింలకు భారత మాతంటే ప్రేమ ఉందని, ఇదే సమయంలో ఆమెను పూజించేందుకు మాత్రం తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.