: మారనున్న ఏటీఎం నిబంధనలు... రాత్రయితే నో క్యాష్!
ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు పెరిగిపోతున్న వేళ, భద్రతా కారణాల రీత్యా నిబంధనలను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపే విధానాన్ని మరింత కఠినం చేయనుంది. పల్లె ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తరువాత, నక్సల్స్ సమస్య నెలకొన్న చోట్ల మధ్యాహ్నం 3 గంటల తరువాత ఏటీఎం సెంటర్లలో నగదు నింపరు. ఇక ఈ ప్రాంతాల్లో ఏటీఎంలను రాత్రిళ్లు మూసి వేయాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపే వాహనాలు మధ్యాహ్నంలోగా డబ్బు తీసుకుని సాయంత్రంలోగానే వాటిని ఏటీఎంలలో నింపాల్సి వుంటుంది. ఇక నగరాలలో అయితే రాత్రి 8 తర్వాత ఏటీఎం సెంటర్లలో నగదు నింపరు. ఇక ఈ వాహనాలకు మరింత భద్రతాంశాలను జోడించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సీసీటీవీ, జీపీఎస్ పరికరాలు సహా, రెండు కంపార్టుమెంట్లు, ఆయుధాలతో కూడిన సుశిక్షితులైన కాపలాదార్లు తప్పనిసరి. వీటిల్లో రూ. 5 కోట్లకు మించిన నగదును సైతం తరలించేందుకు వీల్లేకుండా నిబంధనలను మార్చనున్నట్టు తెలుస్తోంది. వీటిని అమలు చేస్తే, ఏటీఎం దొంగతనాలకు కొంతవరకూ అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.