: మా సైట్ హ్యాక్ చేయండి... 1,50,000 డాలర్లు తీసుకెళ్లండి: అమెరికా రక్షణ శాఖ ఆఫర్
అమెరికా రక్షణ శాఖ (డీవోడీ) తన సైబర్ రక్షణ వ్యవస్థను పరీక్షించాలని భావిస్తోంది. దీని కోసం హ్యాకర్లను ఆహ్వానిస్తోంది. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలు కనిపెట్టి హ్యాక్ చేసి చూపిస్తే 1,50,000 డాలర్లను బహుమతిగా అందజేస్తామని తెలిపింది. 'బగ్ బౌంటీ ప్రోగ్రాం'గా పేర్కొంటున్న దీనిని ఏప్రిల్ 18 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నామని డీవోడీ తెలిపింది. ఇందులో అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే పాల్గొనాలని సూచించింది. అలాగే ఈ పోటీల్లో పాల్గొనే వారి ఐడెంటిటీ, వారి నేరచరితను పరిశీలించేందుకు అంగీకరించాలనే షరతు విధించింది. గతంలో గూగుల్, ఫేస్ బుక్ కూడా ఇలాంటి 'బగ్ బౌంటీ ప్రోగ్రాం' నిర్వహించి లోపాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టాక్సీ సేవల సంస్థ 'ఉబెర్' క్యాబ్స్ యాప్ లో కూడా లోపాలు తెలుసుకునేందుకు ఇదే ప్రోగ్రాం నిర్వహించి పది వేల డాలర్లు నజరానా ప్రకటించింది.