: బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌కు చేరువలో సైనా... నిష్క్రమించిన సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో టైటిల్‌కు చేరువైంది. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 19-21, 21-14, 21-19తో ఐదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. నేడు జరిగే సెమీఫైనల్లో మూడో సీడ్ లీ జురుయ్ (చైనా)తో సైనా తలపడుతుంది. కాగా, రైజింగ్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో సింధు ఎంత స్కోరుతో గెలిచిందో అంతే స్కోరుతో తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సింధు 21-15, 15-21, 15-21తో యోన్ బే జు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ఆకట్టుకున్న సింధు.. రెండు, మూడో గేమ్‌ల్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సైనా నేడు జరిగే సెమీఫైనల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.