: కోల్ కతా ఫ్లై ఓవర్ మాదిరిగానే... ఐవీఆర్సీఎల్ కూడా కూలిపోతోందట!


నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుధీర్ రెడ్డి స్థాపించిన ఐవీఆర్సీఎల్... అనతికాలంలోనే దేశ నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న కంపెనీగా ఎదిగింది. స్వల్ప కాలంలోనే పెద్ద కంపెనీగా ఎదిగిన ఈ కంపెనీ మదుపరులకు కూడా భారీగానే ఆదాయాన్నిచ్చింది. ఇదంతా కొంతకాలం వరకు మాత్రమే. ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయిన ఐవీఆర్సీఎల్.. దినదిన గండంగా కాలం వెళ్లదీస్తోంది. ప్రస్తుతం 900 కోట్ల మేర విలువ ఉన్న ఈ కంపెనీకి రూ.9,700 కోట్ల మేర అప్పులున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లై ఓవర్ కుప్పకూలిన షాకింగ్ ఘటనతో ఈ చేదు వార్తలు బయటకు వచ్చాయి. వివేకానంద ఫ్లై ఓవర్ నిర్మాణ కాంట్రాక్టును 2009లోనే దక్కించుకున్న ఐవీఆర్సీఎల్... ఏడేళ్లలో కేవలం 60 శాతం పనులను మాత్రమే పూర్తి చేయగలిగింది. సదరు ఫ్లై ఓవర్ ను పూర్తి చేసేందుకు ఆ కంపెనీ ఇంకా ఎంత సమయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఫ్లై ఓవర్ కూలిపోవడంతో ఒక్కసారిగా ఐవీఆర్సీఎల్ చిక్కుల్లో పడిపోయింది. ఇదిలా ఉంటే, కంపెనీ ప్రాభవం తగ్గిపోతున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన ప్రమోటర్లు కంపెనీలోని తమ వాటాను క్రమంగా తగ్గించేసుకున్నారు. పలు వాణిజ్య సంస్థలు, బ్యాంకులకు వాటాలు విక్రయించిన సుధీర్ రెడ్డి, ఇతర ప్రమోటర్లు... దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 7.69 శాతానికి పడిపోయింది. తాజాగా ఈ వాటాను కూడా ప్రమోటర్లు తనఖా పెట్టి సొమ్ము చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐవీఆర్సీఎల్ ఇంకెంతో కాలం మనగలిగే పరిస్థితి లేదని ఆర్థిక రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News