: సల్మాన్ ఖాన్ పై అభిమానం అతని కాపురాన్ని కూల్చింది!
సినీ నటులపై అభిమానం కొన్నిసార్లు కొంపముంచుతుందని ఉత్తరప్రదేశ్ లోని ఛెండీలాల్ అనే వ్యక్తి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. లక్నో జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఛెండీలాల్ కు సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. దీంతో సల్మాన్ ను అనుకరిస్తూ గ్రామస్థులతో లోకల్ సల్మాన్ అనిపించుకునేవాడు. తాజాగా సల్మాన్ లా హెయిర్ కటింగ్ చేయించుకుని ఊర్లో తిరగడం మొదలుపెట్టాడు. దీంతో అతని స్నేహితులు సల్మాన్ అని పిలుస్తుంటే మురిసిపోయాడు. అతని తలకట్టు చూసిన అతని భార్య చెల్లెలు (అతని మరదలు) ప్రశంసలు కురిపించింది. దీంతో అతని భార్యకు చిర్రెత్తుకొచ్చింది. అంతే, ఆ రాత్రి నిద్రపోతున్న ఛెండీలాల్ దగ్గరకెళ్లి అతనికి ఏమాత్రం తెలియకుండా జుట్టు కత్తిరించేసింది. తెల్లారి లేచి చూసుకున్న ఛెండీలాల్ కోపంతో ఆమెను ఉతికిపారేశాడు. దీంతో ఆమె రైలుకిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన గ్రామస్థులు ఆమెను వారించి, ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి తన అల్లుడు కుమార్తెను హింసించాడని, ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, అసలు విషయం తెలుసుకుని, ఆశ్చర్యపోయి వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే ఛెండీలాల్ మాత్రం మళ్లీ తలకట్టును సల్మాన్ లా తీర్చిదిద్దుకునే పనిలో నిమగ్నమవ్వడంతో అతని భార్య అతనిని వదిలేసి పుట్టింటికి చేరింది. మొత్తానికి సల్మాన్ పై అభిమానం అతని కాపురాన్ని కూల్చింది.