: కృత్రిమ కాలుతో 'శక్తిమాన్' కోలుకుంటోంది
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడ్డ పోలీస్ గుర్రం 'శక్తిమాన్' కోలుకుంటోంది. కృత్రిమంగా అమర్చిన కాలుతో నిలబడగలుగుతోందని 'శక్తిమాన్'కు చికిత్స చేస్తున్న డాక్టర్ రాకేశ్ నాటియాల్ తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే నిలబడగలుగుతోందని చెప్పారు. గాయపడిన శక్తిమాన్ వెనుకకాళ్లలో ఒకదానిని వైద్యులు తొలగించి కృత్రిమ కాలు అమర్చారు. గ్యాంగ్రీన్ వల్ల ప్రాణాపాయం ఏర్పడటంతో కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. కొన్ని రోజుల్లో నడవగలుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డెహ్రాడూన్ లో బీజేపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అడ్డుకున్నారనే అక్కసుతో పోలీసు బందోబస్తు నిమిత్తం అక్కడ ఉన్న పోలీస్ గుర్రం 'శక్తిమాన్'పై గణేష్ జోషి విచక్షణారహితంగా లాఠీతో బాదాడు. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డెహ్రాడూన్ పోలీసు లైన్స్‌లో పశువైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న శక్తిమాన్‌ను పోలీసులు జాగ్రత్తగా కాపాడుకున్నారు.