: ట్విట్టర్ 'ట్వీట్2 క్విట్' తో ధూమపానానికి చెక్
న్యూస్ అలర్ట్ ఇవ్వడం, అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు.. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్.. మనిషి ఆరోగ్యాన్ని హరించి వేస్తున్న పొగ తాగే అలవాటును మాన్పించడంలో మెరుగైన ఫలితాలనిస్తోంది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా పొగతాగే అలవాటును మానుకోవడం అంత సులభం కాదు. వ్యసనాలకు ఉండే స్వభావమే అంత. అయితే, ట్విట్టర్ 'ట్వీట్2 క్విట్' పొగమాన్పించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తోందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. పొగ మాన్పించడంలో అవలంబించే సంప్రదాయ పద్ధతుల కన్నా కూడా 'ట్వీట్2 క్విట్' మెరుగైన ఫలితాలు ఇస్తోందని పరిశోధకుడు కొర్నెలియా పెచ్మెన్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా 'లో కాస్ట్ ట్రీట్ మెంట్' లా ధూమపానం నిషేధానికి ఉద్దేశించిన 'ట్వీట్2 క్విట్' పనిచేస్తోందని పరిశోధకుడు కొర్నెలియా పెచ్మెన్ తెలిపారు. పొగతాగే అలవాటును మానుకోవాలనుకునే ట్విట్టర్ ఖాతాదారులకు వారు ఎంచుకునే సమయాల్లో 'ట్వీట్2 క్విట్' రోజుకు రెండుసార్లు టెక్స్ట్ సందేశాలు పంపిస్తుంది. ఆ క్రమంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు పొగకు బానిసైన కొందరిని ఎంచుకొని వారిలో కొందరికీ 'ట్వీట్2 క్విట్' సందేశాలు అందేలా, మరి కొందరిని సాంప్రదాయ పద్ధతుల్లో ధూమపానం మాన్పించే ప్రక్రియ అవలంబించేలా ఏర్పాటు చేశారు. ఇలా 60 రోజులు అధ్యయనం చేశారు. ట్వీట్2 క్విట్ సందేశాలు అందుకున్నవారు దాదాపు 40 శాతం దాకా పొగతాగాలనే ఆలోచనను దూరం చేసుకున్నామని చెప్పగా, ఇతరులకు ఆ ఆలోచన 20 శాతం మాత్రమే వచ్చిందని అధ్యయనంలో తేలినట్లు పరిశోధకుడు కొర్నెలియా పెచ్మెన్ తెలిపారు. మిగతావారితో పోలిస్తే పొగరాయుళ్లు పదేళ్ల ముందే మరణిస్తారని, రోజుకో పెట్టె కాల్చేసే వారికి ఈ ముప్పు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువని ఇటీవలే పరిశోధకులు హెచ్చరించారు. ఈ శతాబ్ది అంతానికి మొత్తం వంద కోట్ల మంది పొగ తాగే అలవాటు కారణంగా మరణించవచ్చని వైద్యులు ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.