: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్దోషిగా మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల


మణిపూర్‌ ఉక్కు మహిళగా పేరొందిన పౌర హ‌క్కుల ఉద్య‌మ‌కారిణి ఇరోమ్‌ షర్మిల 2006నాటి ఆత్మహత్యాయత్నం కేసు నుంచి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇరోమ్ ష‌ర్మిల 2006లో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక దీక్షకు దిగిన విష‌యం తెలిసిందే. వివాదాస్పద భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్- ఏఎఫ్ ఎస్‌పీఏ)ను రద్దు చేయాలంటూ సుమారు 16 సంవత్సరాలపాటు షర్మిల దీక్ష కొన‌సాగించారు. 2013లో ఈ కేసుకు సంబంధించి ఆమెపై ఆత్మహత్యా నేరం కింద ఢిల్లీ న్యాయస్థానంలో పోలీసులు చార్జ్ షీట్ కేసు దాఖలు చేశారు. అప్పటినుంచి షర్మిల బెయిల్‌పై ఉన్నారు. అయితే, తాజాగా తుది విచారణ సందర్భంగా తాను నేరం చేసినట్లు షర్మిల అంగీకరించలేదు. తన లక్ష్యాన్ని సాధించడం కోసం నిరాహార దీక్షను తాను కేవలం ఒక ఆయుధంగా మాత్రమే వాడుకున్నానని, జాతిపిత మహాత్మా గాంధీ సైతం ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేశారని ఆమె వాదించింది. తన జీవితాన్ని తాను ఎంతో ప్రేమిస్తున్నానని, అలాంటప్పుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడతానని ఆమె ప్రశ్నించింది. ఈ చట్టాన్ని రద్దు చేస్తే తన నిర‌స‌న దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమవుతానని ఆమె చెప్పారు. ఆత్మ‌హత్య చేసుకునే ఉద్దేశం త‌న‌కెప్పుడూ ఉండ‌బోద‌ని, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్ (ఏఎఫ్ ఎస్‌పీఏ)కు వ్య‌తిరేకంగా పోరాటం మాత్ర‌మే జరుపుతున్నాన‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News