: సైన్యంలో చేరిన కాశ్మీర్ యువకులు... దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామంటూ ప్రమాణం!
జమ్మూకాశ్మీర్ కు చెందిన 143 మంది యువకులు దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అంటూ ప్రమాణం చేశారు. శ్రీనగర్ లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో జమ్మూకాశ్మీర్ కు చెందిన లైట్ ఇన్ ఫెంట్రీ బెటాలియన్ పాల్గొంది. ఈ బెటాలియన్ ను 1947లో ఏర్పాటు చేశారు. దేశ విభజన సమయంలో సరిహద్దుల్లో ఈ బెటాలియన్ విశేషమైన సేవలందించింది. 1947లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినప్పుడు శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ఈ సైన్యం వీరోచితంగా పాల్గొంది. ఆ తరువాత జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లడంతో సైన్యంలో చేరేందుకు జమ్మూకాశ్మీర్ కు చెందిన యువకులు వెనకడుగు వేశారు. సైన్యంలో చేరాల్సిందిగా ఏటా ఆర్మీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నా యువకులు ఆసక్తి చూపడం లేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత చేపట్టిన విధానాలతో సైన్యంలో చేరేందుకు యువకులు ముందుకు వచ్చారు. దీంతో మరోసారి జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్ ఫెంట్రీ బెటాలియన్ ప్రాణం పోసుకుంది. ఇందులో 143 మంది కాశ్మీరీ యువకులు శ్రీనగర్ లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ వారు ప్రమాణం చేశారు.