: చంద్రబాబు ఏపీకి సీఎం... టీడీపీకి కాదు!: వైసీపీ యువ నేత బుగ్గన చురకలు
వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సర్కారుకు మరోమారు చురకలంటించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు సమావేశాల్లో ఎస్డీఎఫ్ పేరిట టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తరహా నిధుల కేటాయింపును ప్రశ్నించిన ఆయన ఓ రేంజిలో ప్రశ్నలు సంధించారు. నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు కాకుండా ఓడిన అభ్యర్థులకు నిధులెలా కేటాయిస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పార్టీ సభ్యుల నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన ప్రభుత్వం విపక్షానికి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రం రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించిందని ఆయన ఆరోపించారు. ఈ రూ.50 లక్షలను కూడా ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ చెందిన నేతలను ఇన్ చార్జీలుగా నియమించి, వారికి కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన చంద్రబాబు, టీడీపీకి మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి సీఎంనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని ఆయన కోరారు.